వ్యాక్సినేషన్ లో దేశం మరో మైలురాయిని చేరుకుంది. 15 నుంచి 18 ఏండ్లలోపు వారిలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసూఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను యువ భారత్ తదుపరి స్థాయికి తీసుకువెళుతోంది. 15 నుంచి 18 వయస్సు గ్రూపు వారిలో 2 కోట్ల మందికి పైగా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు” అని పేర్కొన్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ లో భాగంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 174.99 కోట్లు (1,74,99,61,545) దాటింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు ఒక్క రోజులోనే 32 లక్షలకు పైగా (32,92,516) వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది.
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లకు పైబడిన వారికి ప్రికాషనరీ డోసుల పంపిణీ గత నెలలో ప్రారంభం అయింది. ఇప్పటి వరకు 1.86 కోట్ల మంది(1,86,82,261)కి పైగా ప్రికాషన్ డోసులను అందజేశామని పేర్కొంది.