పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) డిప్యూటీ స్పీకర్ ఖాసీమ్ సూరి వెల్లడించారు.
అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 5కు వ్యతిరేకంగా ఉందని ఆయన వివరించారు. అందువల్ల ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.
ఈ ప్రకటన వెలుపడిన కొద్ది సేపటికే ప్రతిపక్షాలకు ఇమ్రాన్ ఖాన్ షాక్ ఇచ్చారు. ఫెడరల్ అసెంబ్లీతో పాటు, ప్రొవిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేయాలంటూ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ్కి తాను లేఖ రాసినట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగాలని తాను కోరుకుంటున్నట్టు లేఖలో రాసినట్టు పేర్కొన్నారు.
స్పీకర్ నిర్ణయంపై ప్రతి పాకిస్తాన్ పౌరుడిని తాను అభినందిస్తున్నట్టు తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని విదేశీ కుట్రగా ఆయన అభివర్ణించారు. తమను ఎవరు పరిపాలించాలో పాకిస్తాన్ ప్రజలు తేల్చుకోవాలన్నారు.
తనకు ఎస్టాబ్లిష్ మెంట్ మూడు ఆప్షన్స్ ఇచ్చినట్టు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం వెల్లడించారు. అందులో ఒకటి రాజీనామా చేయడమని, రెండోది ముందస్తు ఎన్నికలకు వెళ్లడమని, మూడవది అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడమని తెలిపారు.