సీఎం కేసీఆర్ ఈ రోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. తరువాత ఆయన మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లనున్నారు. దీంతో గంగుల ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
అయితే ఐదేళ్ల ముందు సీఎం కేసీఆర్ కరీంనగర్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఆ హామీలు నెరవేర్చిన తర్వాతనే కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ నిరసనకు దిగారు. సీఎం పర్యటనను అడ్డుకోవాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యాలయంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను బయటకు రానీయకుండా కట్టడి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హస్తం నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అయితే కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని.. కాంగ్రెస్ పార్టీకి అరెస్టులు కొత్తేమీ కాదని.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
మరో వైపు కేసీఆర్ జగిత్యాలలో బండ లింగాపూర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో.. అల్లీపూర్ గ్రామస్తులు సైతం ఆందోళనకు దిగారు. అల్లీపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.