గోవా రెస్టారెంట్ వివాదంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చిక్కుల్లో పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ వివాదంలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఆమెకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఆమె రాజకీయ జీవితంపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు.
వివాదం ఎలా మొదలైంది
గోవాలో సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ ను మరణించిన వ్యక్తి పేరుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతరు జోయిష్ ఇరానీ రినివల్ చేయించారని వార్తలు వచ్చాయి. దీంతో కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శల వర్షం గుప్పించాయి.
స్మృతి ఇరానీ ఏమన్నారంటే?
ప్రతి పక్షాల పోస్టులో నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కోర్టును ఆశ్రయించారు. సిల్లీ సోల్స్ రెస్టారెంట్ తమ కుటుంబ సభ్యులది కాదనీ, దానితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఇరానీ వెల్లడించారు. సోనియా రూ. 5వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో చేసిన ఆరోపణల నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు తమ పోస్టులను తొలగించాలని కోర్టు ఆదేశించింది.
బయటకు వస్తున్న నిజాలు..!
ఈ కేసులో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. స్మృతి కూతురు జోయిష్ ఇరానీ, కుమారుడు జోహర్ ఇరానీ, భర్త జుబీన్ ఇరానీ, ఆయన కూతురు షానెల్లే ఇరానీల పేరిట రెండు కంపెనీలు ఉన్నాయి.
ఈ రెండు కంపెనీలు యైట్ ఆల్ ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీ రిజిష్టర్ అయిన అడ్రస్, సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ నడుపుతున్న అడ్రస్ ఒకటేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
గతంలో పలు విమర్శలు
గతంలోనూ కేంద్ర మంత్రిపై పలు విమర్శలు వచ్చాయి. విద్యార్హతల విషయంలో ఆమె అసత్యాలు చెప్పారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. గతంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖతో విబేధాల నేపథ్యంలో ప్రముఖ న్యూక్లియర్ సైంటిస్ట్ అనిల్ కక్కోదర్ తన ఐఐటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ పదవికీ రాజీనామా చేశారు. స్మృతి ఇరానీ వల్లే అనిల్ కక్కోదర్ రాజీనామా చేశారనే వార్తలు వినిపించాయి.
చుట్టు ముడుతున్న సమస్యలు..
తాజాగా వెలుగు చూస్తున్న విషయాలతో కేంద్ర మంత్రికి సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ ల్యాండ్ ఫిల్లింగ్ ఆరోపణలపై ఇటీవల గోవా టౌన్ ప్లానింగ్ విభాగం నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఆమె ఒంటరైనట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ విషయంలో గోవాలో కానీ, కేంద్రంలో కానీ ఏ భాజపా నాయకుడూ ఆమెకు రక్షణగా బహిరంగంగా ముందుకు వచ్చినట్టు కనిపించడం లేదు.