అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సురక్షితంగా పెరిగిన బిడ్డ.. తీరా లోకాన్ని చూడకముందే ప్రాణాలు విడిచింది. పండంటి బిడ్డను కనాలని ఆసుపత్రికి వచ్చిన ఆ తల్లి కల కలగానే మిగిలింది. ఇంకొద్దిసేపట్లో తమ ఇంటికి వారసుడు/వారసురాలు రాబోతున్నారని సంబురపడిన కుటుంబసభ్యుల ఆనందం ఆవిరైపోయింది. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం మద్దెల బండ తండాకు చెందిన వెంకటమ్మ.. నెలలు నిండటంతో కాన్పు కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి మొదట తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు.
ఈ క్రమంలో వెంకటమ్మకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆందోళన చెందిన బంధువులు వైద్యులకు తెలిపారు. వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా.. శిశువు చనిపోయింది. దీంతో బాధిత మహిళ బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్డ్డి ఆసుపత్రికి చేరుకొని.. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.