ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదని పేర్కొన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంగా వ్యవహరించాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్టా? అని ప్రశ్నించారు.
తమ పార్టీ నేతలపై అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో తాను ఆవేదన చెందానని పేర్కొన్నారు మంత్రి తలసాని. బాధ్యత కలిగిన మంత్రిగా నేను ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పారు. పార్టీలు వేరైనప్పటికీ విమర్శలు అర్థవంతంగా ఉండాలన్నారు.
వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకోవాలని తెలిపారు. విమర్శకు, ప్రతి విమర్శ కూడా అంతే కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు చేసిన కామెంట్స్ గత కొద్ది రోజులు నుంచి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ మేరకు మంత్రి తలసానిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు, కురుమలు నిరసనలు చేపట్టారు. తమ జాతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం క్షమాపణ చెప్పనని తేల్చి చెబుతున్నారు.