మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో దారుణం జరిగింది. ఈ జిల్లా లోని చాంద్ వాద్ తాలూకా షివ్రే గ్రామంలో తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన మహిళను ఆమె అత్తమామలు కొట్టి ముఖానికి నల్లరంగు పూశారు. అంతటితో ఆగక ఆమె మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. జనవరి 30 న జరిగిన ఈ ఘటనలో పోలీసులు కొందరిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
బాధిత మహిళ ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిందని, అయితే ఆమె భర్త ఆమెను ఆమె తలిదండ్రుల ఇంటివద్ద వదిలి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. ఈ మధ్యకాలంలో తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి తన భార్యను చూడడానికి వచ్చాడని తెలిసిందని వారు వెల్లడించారు.
ఈమె తన తలిదండ్రుల ఇంట్లో ఉండగానే.. నీ భర్త సూసైడ్ చేసుకున్నాడని ఆమె అత్తమామలు తెలిపారట.. అయితే తన భర్తను కావాలనే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలు ఇదే విషయాన్ని చెప్పడంతో ఆగ్రహం చెందిన ఆమె అత్తమామలు ఈ అమానుషానికి దిగినట్టు తెలిసింది.
ఈమె వదిన, ఈ గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఈమెను పట్టుకుని ముఖానికి నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారట. ఈ సమాచారం తెలిసినవెంటనే పోలీసులు హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి ఆమెను రక్షించారు.