ఒడిశాలో రాజశ్రీ స్వైన్ అనే యువ మహిళా క్రికెటర్ మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది. కటక్ నగరానికి సమీపంలోని దట్టమైన అడవిలో చెట్టుకు వేలాడుతున్న ఆమె మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ నెల 11 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. నిన్న ఆమె కోచ్ ఈ సిటీలోని మంగళ్ బాగ్ పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. అడవిలో ఆమె మృతదేహం కనబడడంతో షాక్ తిన్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఆమెది అసహజ మరణంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఈ అడవికి దగ్గరలో ఓ స్కూటర్ కనిపించిందని, ఆమె సెల్ ఫోన్ కూడా అక్కడ పడిఉందని, అది స్విచాఫ్ అయి ఉందని వారు చెప్పారు. అయితే రాజశ్రీ స్వైన్ ని ఎవరో హత్య చేశారని ఆమె కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కోసం ఒడిశా క్రికెట్ అసోసియేషన్..కటక్ లోని ఓ మైదానంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించిందని, స్వైన్ తో బాటు సుమారు 25 మంది క్రికెటర్లు ఈ క్యాంప్ కి హాజరు కావలసి ఉందని తెలిసింది.
కానీ ఈ నెల 10 న ప్రకటించిన ఫైనల్ లిస్ట్ లోస్వైన్ పేరు లేదు.. ఆ మరుసటిరోజున మహిళా క్రికెటర్లంతా ప్రాక్టీస్ కోసం తంగి అనే ఏరియాకు వెళ్లినప్పటికీ .. తన తండ్రిని కలిసేందుకు తాను పూరీకి వెళ్తున్నానని స్వైన్ తన కోచ్ కి చెప్పినట్టు తెలుస్తోంది.
స్వైన్ మృతికి ఆమె కోచ్ పుష్పాంజలి బెనర్జీ, , ఒడిశా క్రికెట్ అసోసియేషన్ కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంతో చలాకీ పిల్ల అయిన స్వైన్ ఆత్మహత్య చేసుకునే పిరికి మనస్తత్వం కలిగినది కాదని, క్రికెట్ లో ఎదుగుతున్న ఆమెను ఎవరో హత్య చేశారనే తాము భావిస్తున్నామని ఆమె తండ్రి అంటున్నారు. పోలీసులు అన్ని కోణాల నుంచి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.