సహజంగానే ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే అందులో మీ ప్రమేయం లేకున్నా.. మీ కారణంగా తప్పు జరగకపోయినా.. అందరూ మిమ్మల్నే వేలెత్తి చూపిస్తే.. మీకెలా అనిపిస్తుంది ? కొందరైతే అలాంటి పరిస్థితి ఎదురైతే తీవ్రంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తారు. కానీ ఆమె మాత్రం అలా కాదు. తన తప్పు లేకపోయినా తనను నిందించినందుకు న్యాయస్థానం వరకు వెళ్లింది. కొన్నేళ్ల పాటు పోరాడింది. చివరకు కేసులో విజయం సాధించింది. తనపై పడ్డ నిందను తొలగించుకోవడమే కాకుండా.. ఆ నింద వేసిన వారిచే భారీ ఎత్తున నష్ట పరిహారం కూడా కట్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.?
పాకిస్థాన్ లోని పంజాబ్ యూనివర్సిటీలో 18 ఏళ్ల కిందట వజిహా ఉరూజ్ అనే విద్యార్థిని చదువుతుండేది. అయితే ఆమె ఒక రోజు ఎగ్జామ్ రాశాక సమాధాన పత్రాలను ఇచ్చింది. కానీ ఆమె పరీక్షకు హాజరు కాలేదన్నట్లుగా రిజిస్టర్‌లో నమోదు అయింది. అయితే తాను తప్పు చేయకపోవడంతో ఆమె తన తండ్రిని తీసుకుని యూనివర్సిటీ అధికారుల వద్దకు వెళ్లింది. అక్కడ క్లర్క్ ఆమె తండ్రికి బదులిస్తూ.. మీ కుమార్తె నిజంగా ఎగ్జామ్ రాయలేదు కావచ్చు.. అనడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెదే తప్పని అనుకున్నారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.
అయితే వజిహా ఆ విషయాన్ని విడిచిపెట్టలేదు. సీరియస్‌గా తీసుకుంది. తాను చేయని తప్పుకు తానెందుకు బాధపడాలి, తనపై పడ్డ నిందను తొలగించుకోవాలి.. అని వెంటనే కోర్టులో యూనివర్సిటీపై కేసు వేసింది. ఈ క్రమంలో 17 ఏళ్లుగా ఆమె కోర్టులో యూనివర్సిటీపై పోరాటం చేయగా.. చివరకు యూనివర్సిటీ తప్పు చేసినట్లు అంగీకరించింది. ఆమె సమాధాన పత్రాలు అందాయని, ఆమె ఎగ్జామ్ రాసిందని ఒప్పుకుంది. దీంతో కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు, ఆమెకు యూనివర్సిటీ రూ.8 లక్షలు (పాకిస్థాన్) నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఎట్టకేలకు తనపై పడ్డ నింద తొలగినందుకు, తనకు న్యాయం జరిగినందుకు ఆమె ఎంతో సంతోషంగా ఫీలైంది. అవును మరి.. అందరూ నిజంగా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. చేయని తప్పుకు బలికావల్సిన పనిలేదు, నిందలు మోయాల్సిన పని అస్సలే లేదు. పోరాటం చేస్తే విజయం సాధించవచ్చు..!