ఈ మధ్య ఎందుకో ఏదో ఒక కారణానికి ఎయిరిండియా విమానాలు అప్రదిష్టపాలవుతున్నాయి. ఇటీవలే ఎయిరిండియా ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై మద్యం మత్తులో ఓవ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఉదంతం ఇంకా హాట్ టాపిక్ గానే ఉండగా.. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది.
215 ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న సర్వప్రియ సంగ్వాన్ అనే మహిళ తనకు కలిగిన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విమాన సిబ్బంది తనకు సర్వ్ చేసిన మీల్స్ లో రాయి కనబడిందని ఆమె తెలిపారు. ప్రయాణికులకు రాళ్లు లేని మీల్స్ ని సప్లయ్ చేసేందుకు మీకు వనరులు, డబ్బులు అవసరం లేదనుకుంటా.. ఇలా ఎందుకంటున్నానంటే.. మీరు నాకు ఇచ్చిన మీల్స్ లో రాయి వచ్చింది. జేడన్ అనే మీ ఉద్యోగికి ఈ విషయం తెలియజేశాను.. ఇలాంటి నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు అని ఆమె సుతిమెత్తగా మందలించారు.
ఈ ట్వీట్ చూసిన అనేకమంది యూజర్లు ఎయిరిండియా విమానాల్లో సర్వీసులపట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. టాటా కంపెనీలు ఏవియేషన్ ఇండస్ట్రీకి ఒకప్పుడు ఉన్నత ప్రమాణాలను అందించాయని, ప్రపంచ వ్యాప్తంగా వీటికి గౌరవం ఉండేదని కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఈ సంస్థను చేబట్టాక అవన్నీ మాయమయ్యాయని కొందరు పేర్కొన్నారు.
ఇక సర్వప్రియ సంగ్వాన్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఎయిరిండియా యాజమాన్యం.. తమ కేటరింగ్ సిబ్బంది దృష్టికి దీన్ని తక్షణమే తీసుకువెళ్తున్నామని, తమకు కొంత సమయమివ్వాలని పేర్కొంది. ఈ విషయాన్నీ తమ దృష్టికి తెచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపింది.