అగ్నిపథ్‌ను కాస్తా అగ్గిపథ్ గా మార్చేశారు నిరసనకారులు. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన *అగ్నిపథ్*పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్‌లో దిల్లీకి వెళ్లే ఓ రైలు నిలిచిపోయింది. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ రైలులోనే పురుడు పోసుకుంది. వైద్యం కోసం వెళ్తున్న ఓ వ్యక్తి మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సైన్యంలో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన *అగ్నిపథ్* పథకంపై యువకులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో అనేక రైళ్లను అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా కొన్ని రైళ్లను రద్దు కూడా చేశారు. ఈ నేపథ్యంలో దిల్లీ-హౌరా ప్రధాన మార్గంలో రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఘాజీపూర్‌లోని జమానియా రైల్వే స్టేషన్ లో నిలిచిన దానాపూర్-ఆనంద్ విహార్ రైలు నిలిచిపోవడం వల్ల ఓ మహిళ అందులోనే ప్రసవించింది.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తల్లీబిడ్డలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. బిహార్ కు చెందిన గుడియా దేవి మొరాదాబాద్ నుంచి భగల్‌పుర్ వెళ్లేందుకు దానాపూర్-ఆనంద్ విహార్ రైలు ఎక్కింది. నిరసనల కారణంతో ఆ రైలు ఘాజీపుర్‌లోని జమానియా రైల్వే స్టేషన్లో నిలిచిన సమయంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆమె రైలులోనే ఆడపిల్లను ప్రసవించింది. స్టేషన్ అధికారుల ఆదేశాల మేరకు తల్లీబిడ్డలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
వైద్యం కోసం వెళ్తూ మృతి…
అదే రైలులోని స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్న పట్నాలోని విక్రమ్ గ్రామానికి చెందిన రామేశ్వర్ గత కొద్ది రోజులుగా గుండె సమస్యలతో బాధపడుతున్నాడు. ఆకస్మాత్తుగా రైలులో అతడికి గుండెనొప్పి రావడంతో, సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల నొప్పి వచ్చిన కొద్దిసేపటికే అతని పరిస్థితి విషమంగా మారింది. అంబులెన్స్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.