ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది ఓ మహిళ. అయితే వారంతా బాలికలే కావడం విశేషం. అందులోనూ నార్మల్ డెలివరీలో ఐదుగురిని ప్రసవించింది ఆ మహిళ. శిశువులు ఏడు నెలలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ లోని సూరజ్ పుర్ జిల్లాలో భాట్ గావ్ లోని నివసిస్తోంది గీతా యాదవ్ అనే మహిళ. ఈమె మరుగుజ్జు మహిళ కావడంతో గర్భం దాల్చడంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందుకోసం ఆమె నిరంతరం చికిత్స తీసుకునేది. చివరకు గర్భం దాల్చింది. సోమవారం పురిటి నొప్పులు వచ్చేసరికి రాంచీలోని రిమ్స్ లో చేరింది మహిళ.
రిమ్స్ వైద్యుడు శశి బాల సింగ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం.. గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసింది. ప్రస్తుతం తల్లి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. చిన్నారులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఒకే కాన్పులో ఐదుగురు జన్మించడం ఝర్ఖండ్ లో ఇదే తొలిసారి అని రిమ్స్ యాజమాన్యం వెల్లడించింది.
మహిళ ఎత్తు తక్కువగా ఉండటం, నార్మల్ డెలివరీకి ఆమె శరీరం సహకరించేలా లేకపోవడం వల్ల, మొదట సిజేరియన్ చేయాలని భావించామని చెప్పారు రిమ్స్ వైద్యులు. అయితే నిపుణులైన వైద్య బృందం సహాయంతో మహిళకు విజయవంతంగా సాధారణ ప్రసవం చేశామని తెలిపారు. శిశివుల బరువు 2 కేజీలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.