పేరుకే బంగారు తెలంగాణ. కానీ ప్రజల పరిస్థితి హీనాతి హీనం.అందుకు నిదర్శనం…ఈ ఒక్క సంఘటన చాలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద ఓ చెంచు మహిళ ప్రసవించింది. బల్మూర్ మండలంలోని బాణాల గ్రామానికి చెందిన నిమ్మల లాలమ్మ మంగళవారం ఉదయం కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పిపి కిట్లు లేవని ఏదైనా ఇతర ఆసుపత్రులకు లేక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో, నిండు గర్భిణీని తీసుకెళ్లి గేటు వద్ద ఉంచేశారు.
అదే సమయంలో ఆమెకు నొప్పులు ఎక్కువ అయ్యాయి. అప్పటికీ వైద్యులు, సిబ్బంది ఎవరు కనికరించకపోవడంతో ఆమెతో పాటు వచ్చిన కొంతమంది గేటు వద్ద ఆమెకు పురుడు పోశారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది పాపను వేరు చేసి ఆసుపత్రిలోకి తీసుకెళ్ళి చికిత్స ప్రారంభించారు.
ఈ సందర్భంగా చెంచు మహిళలు మాట్లాడుతూ..తాము చెంచు పేద ప్రజలమని తాము వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే తమ గురించి వైద్యులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.