ప్రాణ భయం ఎవరికి ఉండదు చెప్పండి..! చావు ప్రతి జీవికీ అనివార్యమని తెలిసినా మనిషి ఉన్నంతలో మసాలా కలుపుతుంటాడు.చిన్న ఛాన్స్ తగిలినా తప్పించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ బలహీనతను బలంగా ఉపయోగించుకుని చాలా ఆసుపత్రులు ఆస్తులు దోచుకున్నాయ్.ఈ దందా కోవిడ్ మహమ్మారి జరిపిన విధ్వంసంకాడలో మనం చూసాం.
మూడేళ్ల క్రితం సృష్టించిన కొవిడ్ ప్రళయాన్ని ఇంకా మరిచిపోలేక పోతున్నాం. ఆ వైరస్ ధాటికి ఇప్పటికీ కొందరు భయపడుతూనే ఉన్నారనడంలో డౌటే లేదు. నేటికీ ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు సైతం జంకుతున్నారు. పాడేనోరూ ఆడేకాలు..కుదురుగా ఉండదనీ…! అప్పటికీ లాఠీదెబ్బలు తింటూనే తప్పక తిరిగాం.
ఇప్పటికీ భయంగానే ఉన్నా..వైరస్ ఇచ్చిన వైల్ట్ కార్డ్ ఛాన్స్ లా బాహాటంగా తిరుగుతున్నాం. అయితే కోవిడ్ భయంతో ఇప్పటికీ ఇంట్లోనే మగ్గిపోతున్న కుటుంబాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా హరియాణా రాష్ట్రం గురుగావ్ లో ఒక ఫ్యామిలీ ప్రధాని మోడీ ఇచ్చిన చప్పట్ల పిలుపుమేరకు ఇంటి తలుపులు బిడాయించుకుని మళ్ళీ బైటకు రాలేదట.
షాకింగ్ గా ఉంది కదూ..!నిజమండి..!! గత మూడేళ్లుగా ఓ తల్లి.. తన 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. తన భర్తను సైతం ఇంట్లోకి రానివ్వట్లేదు. ఆ కథేంటో తెలుసుకుందాం.
గురుగ్రామ్.. మారుతీ విహార్కు చెందిన మున్మున్ అనే మహిళ తన భర్త, 11 ఏళ్ల కుమారుడితో కలిసి నివసించేది. అయితే కొవిడ్ వచ్చినప్పటి నుంచి ఆమె తన కుమారుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది.
తాను బయటకు రావట్లేదు.తన కుమారుడిని కూడా బయటకి వెళ్లనియ్యట్లేదు. తన భర్తను ఇంట్లోకి రానివ్వట్లేదు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి. ఆమె భర్త బంధువులు, స్నేహితుల ఇంట్లో కొన్నాళ్లు పాటు తలదాచుకున్నప్పటికీ…భార్య వైఖరిలో మార్పు వస్తుందని ఆశపడ్డాడు. ఎంతకీ ఆమె మారకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆరోగ్య సిబ్బంది, పోలీసులు…ఇంటి తలుపులు పగలగొట్టి తల్లీకుమారుడిని ఆస్పత్రికి తరలించారు. మున్మున్ భర్త..ఆమెకు, కుమారుడికి భోజనం, నీరు ఏర్పాటు చేసేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాను కొన్నాళ్లుగా వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నానని మున్మున్ భర్త తెలిపాడు. కొవిడ్ ముగిసిందని తన భార్యను ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె వినలేదని చెప్పాడు.