ఢిల్లీలో ఓ మహిళా పోలీస్ అధికారిని కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రీతి అహ్లవత్ (26) అనే సబ్ ఇన్ స్పెక్టర్ రోహిని మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తలపై కాల్చడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ పుటేజ్ ను పరిశీలించగా పోలీస్ అకాడమీలో ఆమె బ్యాచ్ మేట్ దీపాంశ్ రతి నే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది. ఆహ్లావత్ ను కాల్చిచంపిన వెంటనే దీపాంశ్ రతి హర్యానాలోని సోనిపట్ కు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆహ్లావత్, దీపాంశ్ రతిలు 2018 బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్లు. దీపాంశ్ రతికి ప్రీతి అంటే ఇష్టం. అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె అతని ప్రేమకు అంగీకరించడం లేదు. దీంతో కక్ష పెంచుకున్న దీపాంశ్ ప్రీతిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు ఈ కాల్పుల సంఘటన జరగడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.