చదివింది పదో తరగతి వరకే.. కానీ మోసాలు చేసి అమాయక ప్రజలనుంచి లక్షలకు లక్షలు డబ్బు గుంజడంలో ఆ లేడీ కిలాడీ’ పీ హెచ్డీ’ కూడా చేసింది. ఢిల్లీలో తనను ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ గానో లేదా క్రెడిట్ కార్డు కంపెనీ అధికారి గానో బిల్డప్ ఇచ్చుకుంటూ పలువురికి కుచ్చుటోపీ పెట్టింది. సూర్య ఎస్. అలియాస్ జెన్నిఫర్ అనే ఈ పాతికేళ్ల యువతి బండారం బయటపడడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
ఈమె గత చరిత్రలోకి వెళ్తే.. లోగడ గుర్ గావ్ లోని ఓ కాల్ సెంటర్ లో పని చేసిన జెన్నిఫర్ .. 2017 లో ఉద్యోగం కోల్పోయింది. ఆ తరువాత ఫేక్ లోన్లు ఇస్తామని అమాయకులను బురిడీ కొట్టించే ఫేక్ కాల్ సెంటర్ లో చేరి.. ఇందులో 50 పర్సెంట్ పార్ట్ నర్ కూడా అయింది. నాలుగు నెలల్లోనే తన అక్రమ దందాతో అనేకమంది నుంచి డబ్బులు గుంజింది. గత ఏడాది జనవరిలో ఆ ఫేక్ కాల్ సెంటర్ నుంచి బయటకి వచ్చి తానే సొంతంగా ఇలాంటి ‘దుకాణం’ పెట్టుకుంది.
ఎస్ బీ ఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన లింకులను తన ‘టార్గెట్లకు’ పంపుతూ ఒక్క సంవత్సరంలోనే 25 లక్షలకు పైగా సంపాదించింది. అయితే జెన్నిఫర్ ‘టార్గెట్ల’ లో ఒకరికి అనుమానం కలిగింది. తాను ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ నని, మీ క్రెడిట్ కార్డు కాలపరిమితి ముగిసిపోతున్నందున మీకు రివార్డు పాయింట్లు ఇస్తానని నమ్మబలికి ఓ కస్టమర్ ని బుట్టలో వేసుకుంది.
ఆమె ఇచ్చిన లింకులను బట్టి ఆయన తన బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపిన కొద్దిసేపటికే తన అకౌంట్ నుంచి 22 వేలకుపైగా క్యాష్ డిడక్ట్ అయినట్టు ఆయనకు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని జెన్నిఫర్ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఆమెను అరెస్టు చేశారు. తాను ఓ ఫేక్ వెబ్ సైట్ లింక్ ని క్రియేట్ చేశానని, దాని ద్వారా బాధితులను మోసగిస్తూ వచ్చానని జెన్నిఫర్.. పోలీసుల దర్యాఫ్తులో అంగీకరించింది.