వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఓ మహిళ 100 కొరడా దెబ్బలను శిక్షగా అనుభవించింది. అయితే ఆమెతో పాటు దొరికిన వ్యక్తికి మాత్రం 15 దెబ్బలు శిక్షగా విధించారు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని ఎచెహ్ ప్రావిన్స్‌లో ఓ జంట మధ్య కొంత కాలంగా నడుస్తున్న వివాహేతర సంబంధం బయటపడటంతో అక్కడి అధికారులు ఈ విధమైన శిక్షలు విధించారు.
చెట్ల కింద ఏకాంతంగా గడుపుతున్న ఈ జంట స్థానికులకు కనిపించారు. దీంతో, వీరి మధ్య సంబంధం గుట్టురట్టైంది. అయితే దీనిపై ప్రశ్నించగా.. ప్రియుడు వివాహేతర సంబంధం లాంటివి ఏం లేవని ఆరోపణల్ని కొట్టిపారేశాడు. కానీ.. ఆ మహిళ ఆ విషయాన్ని ఖండించలేకపో్యింది. తామిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉండటం నిజమే అని ఒప్పుకుంది. దీంతో ఆమెకు 100 కొరడా దెబ్బలు విధించిన అధికారులు ప్రియుడికి 15 కొరడా దెబ్బలతో సరిపెట్టారు.
ఆమెకు వివాహం కాలేదు.. కానీ.. ప్రియుడికి పెళ్లి అయింది. ఇలా లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు అంగీకరించడంతో ఆమెకు ఇంత కఠినమైన శిక్ష విధించినట్లు జడ్జి ఇవాన్ నజ్జర్ అలవి చెప్పారు. చేసింది తప్పు అని భావించినపుడు శిక్షలు అమలు చేయడంపై ఎలాంటి వాదనలు లేవు కానీ.. తప్పును ఒప్పుకున్నవారికి పెద్ద శిక్ష.. తప్పును తోసిపుచ్చిన వారికి చిన్న శిక్షలు విధించడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి చర్యల వలన తప్పు చేసిన వారు తప్పించు కోవడానికి అవకాశాలు కల్పించినట్టు ఉంటుందని అంటున్నారు. జూదం, వ్యభిచారం, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలపై కొరడా ఝులిపించేందుకు పర్షియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోన్న ఏకైక ప్రాంతం ఇండోనేషియాలోని ఎచెహ్. పైగా అక్కడ శిక్షలను బహిరంగంగా అమలు చేస్తారు.