కట్నం కోసం అత్యంత దారుణానికి ఒడిగట్టింది ఓ కుటుంబం. పచ్చి బాలింతరాలని కూడా చూడకుండా ఇంటినుంచి బైటకు గెంటేసిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా హరూర్ సమీపంలోని కీరపట్టి గ్రామంలో వెలుగుచూసింది. తన ఇద్దరి కొడుకులతో 20 రోజుల పసిగుడ్డుతో దిగ్గుతోచని ఆ మహిళ స్థానికి బస్టాండులోనే తలదాచుకున్న నేపథ్యం కలచివేసింది. తీవ్ర శోకంతో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు.. డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ.. మహిళ కానిస్టేబుల్ బృందాన్ని అక్కడికి పంపించారు. అనంతరం ఆమెను పోలీసుల స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమె పేరు గీత. భర్త ప్రశాంత్. అత్తమామలు గీతను కట్నం కోసం తీవ్రంగా హింసించారు.
ఆమెపై దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు కొడుకులతో హరూర్ బస్టాండ్లోనే తలదాచుకుంది. స్థానికులే ఆమెకు ఆహారాన్ని అందించారు “నా భర్త, మిగతా కుటుంబ సభ్యులు కట్నం కోసం నన్ను హింసిస్తున్నారు.
రెండేళ్ల క్రితమే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో వారు సరిగ్గా చర్యలు తీసుకోలేదు. అనంతరం నన్ను మా పుట్టింటికి పంపించారు. కొద్ది నెలల క్రితమే నేను నా భర్త వద్దకు వచ్చాను.
20 రోజుల క్రితమే నాకు బాబు పుట్టాడు. అయినా కట్నం కోసం వేధిస్తూ.. నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.” అని బాధితురాలు గీత ఆవేదన వ్యక్తం చేసింది. గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నాం.కట్నం విషయం నిజమని తేలితే నిందితులపై చర్యలు తీసుకుంటామని హరూర్ డీఎస్పీ పుగలేంటి గణేష్ తెలిపారు.