డబుల్ బెడ్ రూంల లొల్లి కరీంనగర్ ను తాకింది. పట్టణంలో మూడేండ్ల క్రితం నిర్మించిన 1600 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదవాళ్లకు తక్షణమే కేటాయించాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్(ఎస్డీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు 200 మంది మహిళలతో ఎస్డీఎఫ్ తరఫున నిరసన ప్రదర్శన చేపట్టారు.
పట్టణంలోని కలెక్టరేట్ వరకు ఎస్డీఎఫ్ ఆధ్వర్యంలో మహిళలు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ ఎదుట సుమారు గంట సేపు మహిళలు బైఠాయించారు. నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్డీఎఫ్ కన్వీనర్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి , ఎస్డీఎఫ్ కో కన్వీనర్ సంగం రెడ్డి పృథ్విరాజ్ నేతృత్వం వహించారు.
మీకు ప్రగతి భవన్ – మాకు పూరి గుడిసెలా ? అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన పేదవాళ్లకు కేటాయించాలనే డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆకునూరి మురళితో పదిమంది మహిళలు కలిసి అదనపు కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.
కట్టిన 1600 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వారంలోగా అర్హులైన పేదలకు కేటాయించాలని వారు వినతి పత్రంలో కోరారు. అనంతరం భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణ కోసం ఓ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.