ఏపీలో రాజధాని అంశం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. అమరావతిని ఏపీకి రాజధానిగా కొనసాగించాలంటూ కొన్నిరోజులుగా ఆ ప్రాంత రైతులు వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అక్కడి రైతులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మందడంలో కొంతమంది మహిళా రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను తూర్పారపడుతూ… జగన్‌వి తుగ్లక్ నిర్ణయాలని మండిపడ్డారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను ఆందోళన విరమించాలని సూచించారు. అయినప్పటికీ మహిళా రైతులు పోలీసుల సూచనను పట్టించుకోకపోవడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడ మహిళా రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులను పోలీసులు వాహనంలో ఎక్కిస్తుండగా స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. పోలీసు వాహనం టైరు చేతిపైకి ఎక్కడంతో ఓ రైతుకి గాయాలయ్యాయి. పోలీసుల తీరు సరిగ్గా లేదంటూ పోలీసు వాహనాన్ని రైతులు అడ్డకున్నారు.