మద్యపాన నిషేధమే ధ్యేయమని చెబుతున్న జగన్ సర్కార్ ఇళ్ల మధ్య వైన్ షాపులు వద్దని చెప్పిన మహిళలపై అమానుషంగా పోలీసులు విరుచుకుపడుతుంటే ఏం చేస్తోంది? ప్రభుత్వమే ఇళ్ల మధ్య లిక్కర్ షాపు ప్రారంభించిందంటూ శ్రీకాళహస్తిలో కొద్దిరోజుల క్రితం మహిళలు తిరగబడితే ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు మరో జిల్లాలో ఇలాంటి ఆందోళనే జరిగితే పోలీసులు వచ్చి ఈడ్చి పక్కన పడేశారు.
నెల్లూరు: ఆత్మకూరులో మహిళలపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. బస్టాండ్ సెంటర్ ఆవరణలో ఇళ్లమధ్య వైన్ షాపు పెట్టవద్దని మహిళలు ధర్నాకుదిగారు. ఆడపిల్లలు స్కూళ్లకు వెళుతుంటారని.. బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉందని మహిళలు ఆందోళన చేశారు. ప్రభుత్వం మద్యం దుకాణం వద్దంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అయితే ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను ఈడ్చుకుని పక్కకు లాగేసారు. ఇళ్లమధ్యలో ప్రభుత్వం మద్యం దుకాణం వద్దని ఎక్సైజ్, ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.