దేశంలో తమ సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛమహిళలకు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహిళా సాధికారత అన్నది ఇప్పడు ఎంతో ముఖ్యమని చెప్పారు. దసరా సందర్భంగా బుధవారం నాగ పూర్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మహిళలను కూడా పురుషులతో సమానంగా చూడాల్సి ఉందని, ‘నారీ శక్తి’ అన్న నినాదాన్ని సమాజం పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
హిందూ రాష్ట్ర కాన్సెప్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వాల్డ్ హిందూ అన్నదానిపై తాము సదా దృష్టి పెడతామని తెలిపారు. ఈ రోజు చీఫ్ గెస్ట్ గా పర్వతారోహకురాలు ‘పద్మశ్రీ ‘పురస్కార గ్రహీత సంతోష్ యాదవ్ రావడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ తమ కార్యక్రమాలకు ఓ మహిళను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. లోగడ ఎవరెస్టు శిఖరాన్ని ఈమె ఎక్కిన విషయాన్ని మోహన్ భగవత్ ప్రస్తావించారు. దేశంలో జనాభా అదుపునకు సమగ్రమైన పాపులేషన్ కంట్రోల్ పాలసీ అన్నది అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇది అందరికీ సమానంగా వర్తించాలన్నారు.
ఇది ఒకసారి అమలైన పక్షంలో.. ఏ వ్యక్తికీ రాయితీ అన్నది ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల క్రితం ఫలదీకరణ రేటు 2.1 ఉండేదని, అది కొంతకాలానికి 2 కి తగ్గిందని, కానీ మరింత తగ్గితే హానికరమని ఆయన హెచ్చరించారు.జనాభాలో తులనాత్మకత అవసరం.. ఇలా లేకపోతే దేశం చీలిపోయే ప్రమాదం ఉంది అన్నారాయన. సరిహద్దుల నుంచి చొరబాట్లు కూడా ఓ సమస్యగా మారిందని, జనాభా తులనాత్మకత లో హెచ్చు తగ్గులకు ఇదొక కారణమని ఆయన పేర్కొన్నారు. దీనిపై దేశం దృష్టి సారించాల్సి ఉందన్నారు.
నేడు తమ సంస్థ నిర్వహించిన ఈవెంట్ కి ఓ మహిళను ఆహ్వానించడం ఇది మొదటిసారి కాదని మోహన్ భగవత్ గుర్తు చేశారు. లోగడ మాజీ కేంద్ర మంత్రి అమృత కౌర్ ని, నాగ్ పూర్ నుంచి తొలి లోక్ సభ సభ్యురాలైన అంసుబాయి కాలేని, మరికొందరిని కూడా ఆహ్వానించామని ఆయన వెల్లడించారు. అయితే కొన్ని మీడియా సంస్థలు బుధవారం ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమానికి మొదటిసారిగా మహిళను ఆహ్వానించారని పేర్కొన్నాయి.