అది ఒక మహిళపై గౌరవంతో, ఆమె పేరుతో నడపబడుతున్న ఆసుపత్రి. కానీ అక్కడ పనిచేస్తున్న మహిళల పరిస్థితి మాత్రం గుండె తరుక్కుపోతుంది. హైదరాబాద్ లోని విద్యానగర్ లో దుర్గాబాయ్ దేశముఖ్ ఆసుపత్రికి ఎంతో పేరుంది. కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చితే… తక్కువ ధరల్లో సామాన్యులకు మెరుగైన వైద్యం లభిస్తుంది. అందుకే నగరం నుండే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది పనితీరుకు రోగుల ప్రశంసలు అందుతాయి. కానీ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు కొందరి కారణంగా ఆసుపత్రి పేరు పోయేలా ఉంది.
నాలుగు నెలల క్రితం కొన్ని తప్పులు చేస్తూ ఇక్కడి సిబ్బందికి అడ్డంగా దొరికి సస్పెండైన నీలకంఠ అనే డాక్టర్ చక్రం తిప్పి మళ్ళీ ఇదే ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు నరకంగా మారింది ఈయన గారి వ్యవహారం. కేవలం నర్సింగ్ స్టాఫ్ మాత్రమే కాదు మహిళా డాక్టర్లు కూడా ఈయనకు భయపడాల్సి వస్తుంది. మహిళా ఉద్యోగులకు అర్ధరాత్రి కాల్స్ చేయటం, మెసెజ్ లు పెడుతూ… స్పందించకపోతే డ్యూటికి వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో ఈయన పనిచేసే ఆసుపత్రిలోనూ ఇదే విధంగా చేస్తే తన్ని తరిమేశారని మండిపడుతున్నారు.
తనకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసని, ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు చూసుకుంటారని చెప్పుకుంటూ మహిళా సిబ్బందిని చెప్పుకోలేని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే ఇందులో జోక్యం చేసుకొని తమను రక్షించాలని కోరుతున్నారు.