నిరుపేద మహిళలను, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కొందరు యువతులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు మరో దారుణానికి ఒడిగట్టారు, తాము ఎంచుకున్న మహిళ లకు డబ్బు ఎర చూపి, . ఏదో రకంగా వారు ఒప్పుకునేలా మాయమాటలు చెప్పి నగ్న చిత్రాలు కావాలంటారు. వాటిని హైదరాబాద్‌లోని తమ గురువుకి పంపితే డబ్బులు వస్తాయంటూ నమ్మిస్తారు.
అలా మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు సుమారు 25 మంది అమాయక మహిళల నగ్న చిత్రాలు సేకరించిన ముఠాను మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న జడ్చర్లలోని పాత బజారులో గొడవ జరుగుతుందని డయల్ 100 కు ఫోన్ కాల్ చేశారు. అక్కడి ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మొదట జైనుల్లావుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.మహిళచిత్రాలు తీశారన్న ఆరోపణ పై విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.వనపర్తికి చెందిన జైనుల్లావుద్దీన్ జడ్చర్లలో అద్దెకు నివాసం ఉంటున్నారు.ఆయనతో పాటు రాములు, శంకర్ ఆలీ, రాములు నాయక్ కలిసి మహిళల శరీరాకృతికి సంబంధించి నగ్న చిత్రాలు సేకరిస్తున్నారు. నిరుపేద మహిళల్ని డబ్బు ఎరగా ఊపి తమకు తెలిసిన గురువు ఉన్నారని ఆయన పూజకు ఎంపిక చేస్తే కోట్లలో డబ్బులు వస్తాయని ఆశచూపారు. పూజకు ఎంపిక కావాలంటే శరీరాకృతికి చెందిన నగ్నఫోటోలు తిరుపతి అనే వ్యక్తికి పంపాలని చెప్పారు.
అలా 2 నెలలుగా 20 నుంచి 25 మంది మహిళల నగ్న ఫోటోలను సేకరించి తిరుపతి అనే వ్యక్తికి పంపినట్లు దర్యాప్తులో తేలింది.అయితే పంపిన ఫోటోలు తిరుపతి ఏం చేస్తాడు? తిరుపతి గురువు ఎవరు? ఈ ఫోటోలతో ఏం చేస్తారన్నది నిజం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ముఠాలోని నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతి అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని అతన్ని విచారిస్తే అసలు విషయాలన్ని బయటకు వస్తాయని జడ్చర్ల సీఐ రమేష్ బాబు తెలిపారు.
జడ్చర్లలో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు తిరుపతి అరెస్ట్ అయితే గానీ ఈ కేసులో కీలక ప్రశ్నలకు చిక్కుముడి వీడదు. పోలీసులు మాత్రం తిరుపతి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు.