మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య వెనుక రాజకీయ చీకటి కోణం నడిచిందని కాంగ్రెస్ బక్క జడ్సన్ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక నిందితుడు సైఫ్ ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నించారని ప్రీతి పేరెంట్స్ తో పాటు పలువురు అనుమానిస్తున్నారు. దానికి కారణం సైఫ్ తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీకి బంధువు కావడం.
దీంతో కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో సైఫ్ అనే సీనియర్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు పై ఎన్ హెచ్ ఆర్సీ నిన్న రాత్రి స్పందించినట్లుగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, వరంగల్ పోలీసు కమీషనర్ తో పాటు మొత్తం నాలుగు డిపార్ట్ మెంట్లకు ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు జారీ చేసిందని బక్క జడ్సన్ అన్నారు.
అయితే రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ఆడవారి పై వివక్ష కొనసాగుతూనే ఉందని ఆయన మండిపడ్డారు. వీటిని పట్టించుకోకుండా ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, బార్లు రాజ్యమేలుతున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆయన విమర్శించారు. ముందు రాష్ట్రంలో మహిళలకు తగిన రక్షణ కల్పించి తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేయాలని ఆయన కవితకు హితవు పలికారు.