– మహిళా బిల్లు కోసం భారత జాగృతి దీక్ష
– 18 పార్టీల సంఘీభావం
– బిల్లు ఆమోదం పొందేవరకు పోరాడతామన్న కవిత
– భారత జాగృతికి పోటీగా బీజేపీ ధర్నాలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ దీక్షకు 18 పార్టీలు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దీక్షను కవిత సాయంత్రం 4 గంటలకు విరమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని.. అది జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలన్నారు.
భారత సంస్కృతిలో మహిళలకు పెద్దపీట వేశారని.. కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్ లో ఉందన్నారు. 1996లో దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని.. అయినా దృష్టి సారించకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమన్న కవిత.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పాసయ్యేలా, అందరం కలిసి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
మహిళల రిజర్వేషన్ కోసం ఇది పోరాట సమయమని అభివర్ణించిన ఆమె.. చిన్నగా మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే, అన్నింట్లో రాణిస్తారని.. ఉద్యమానికి మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము దీనిపై స్పందించాలని కోరారు.