శ్రీనివాసుడి సన్నిధిలో అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాట వచ్చింది.
తిరుమల: లండన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయురాలు ప్రతిమ పుట్టు మూగ అయిన 18 ఏళ్ళ కుమారుడు దీపక్‌తో కలిసి స్వామి దర్శనానికి వచ్చింది. ప్రత్యేక దర్శన టిక్కెట్లతో స్వామిని దర్శించుకున్నారు. ప్రసాదాలు, స్వీకరించి పడి కావలి దగ్గరకు రాగానే కొడుకు దీపక్ వెంట మాటలు రావడం గమనించి ప్రతిమ ఆశ్చర్య చకితురాలైంది. దగ్గరగా వెళ్లి చూడగా కొడుకు నోటివెంట గోవిందా…గోవిందా అన్న మాటలు వినిపించాయి. మరోసారి అనమని కోరగా మళ్లీ గోవింద నామస్మరణ చేశాడు. ఇక మూగ కుమారుడి నోట మాటవిని ఆ తల్లి ఆనంద పరవశురాలైంది. ఇది గమనించిన భక్తులు కూడా గోవింద నామస్మరణ చేయడంతో ఆలయం మార్మోగింది.
తన కుమారుడికి ఏ వైద్యం చేయించినా ఇప్పటిదాకా మాటలు రాలేదని, ఇది స్వామి మహిమేనని ప్రతిమ చెప్పింది. టీటీడీ అధికారులు తర్వాత ఆ తల్లీ కుమారులకు సుప్రభాత దర్శనం చేయించారు. స్వామి సన్నిధిలో ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయని వారు చెప్పారు.