భారత్ లో తాలిబనీకరణ ఆలోచనను దేశ ముస్లింలు ఎప్పటికీ అనుమతించరని అజ్మీర్ దర్గ దివాన్ జైనుల్ అబిదిన్ అలీ ఖాన్ అన్నారు. ఉదయ్ పూర్ లో టైలర్ హత్యను ఆయన ఖండించారు.
ప్రపంచంలో ఏ మతం కూడా మానవాళికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించదని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇస్లాం మతంలో, అన్ని బోధనలు శాంతికి మూలాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
‘ కొంతమంది నైతికత లేని వ్యక్తులు ఒక పేదవాడిపై క్రూరమైన దాడికి పాల్పడ్డారు. దీన్ని ఇస్లామిక్ ప్రపంచంలో శిక్షార్హమైన పాపంగా పరిగణిస్తారు. ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి’ అని అన్నారు.
ఈ హత్యను జమాయత్ ఉలేమా-ఇ- హింద్ జనరల్ సెక్రటరీ మౌలానా హకీముద్దిన్ ఖాసీం కూడా ఖండించారు. ‘ఈ ఘటనను ఎవరు చేసినా ఏ విధంగానూ దాన్ని సమర్థించలేం. ఇది దేశ చట్టాలకు, మన మతానికి విరుద్ధం’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు