తమ దేశంలో ప్రార్థనామందిరాలపై దాడులను సహించే ప్రసక్తి లేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ .. ప్రధాని మోడీకి హామీనిచ్చారు. ఇందుకు బాధ్యులెవరైనా వారిపై చట్టాన్ని పూర్తిగా ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్ట్రేలియాలో గత కొన్ని వారాలుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను మోడీ ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఇలా స్పందించారు.
ఇలాంటి ఘటనలు తమను ఆందోళనకు గురి చేస్తాయని, భారతీయుల కలవరాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలని మోడీ కోరారు. ఇటీవల బ్రిస్ బేన్, తదితర సిటీల్లో స్వామి నారాయణ్ వంటి ఆలయాలపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడులు చేసి, అక్కడి భారతీయులను భయకంపితులను చేశారు. ఆలయాల లోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఆల్బనీస్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మోడీ.. ఈ ఘటనలను ఆయన దృష్టికి తెచ్చారు. సిడ్నీ లోని భారతీయ హైకమిషన్ వీటిపై తన నిరసనను ఆస్టేలియా ప్రభుత్వానికి తెలియజేసిందన్నారు. దీనిపై స్పందించిన అల్బనీస్.. ఈ దేశ ప్రజలను తాము ఎప్పటికీ గౌరవిస్తుంటామని, తమ దేశంలో హిందూ ఆలయాలైనా, మసీదులైనా, లేక చర్చిలైనా వాటిపై దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించి అందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
గత శుక్రవారం మొట్టమొదటి ఇండియా-ఆస్ట్రేలియా సమ్మిట్ సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మైత్రి బలంగా ఉందని, భవిష్యత్తులో కీలక రంగాల్లో ఇది మరింత విస్తృతమవుతుందని ఆయన చెప్పారు.