వణికించే చలిలో కూడా తాను వెచ్చదనం కోసం స్వెట్టర్ ఎందుకు ధరించడం లేదో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివరించారు. నేను చలికి వణకనంత వరకు దీన్ని ధరించరాదని, టీ షర్ట్ మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నానన్నారు. అసలు కారణాన్ని హర్యానాలోని అంబాలా లో తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఎముకలు గడ్డ కట్టించే చలి, శీతల వాతావరణంలో కూడా మీరు స్వెట్టర్ ఎందుకు ధరించడం లేదని చాలామంది తనను ప్రశ్నిస్తుంటారని.. చలికి వణుకు రానంతవరకు దాన్ని వేసుకోరాదని నిర్ణయించుకున్నానని చెప్పిన ఆయన.. కేరళలో తన యాత్ర సాగుతున్నప్పుడు అక్కడ వేడి వాతావరణం ఉందని, కానీ మధ్యప్రదేశ్ లోకి ఎంటర్ కాగానే చలి మొదలైందని అన్నారు. ఒకరోజున ముగ్గురు పేద బాలికలు చిరిగిన దుస్తులతో తనవద్దకు వచ్చారని, వారు చలికి వణుకుతూ కనిపించారని ఆయన తెలిపారు. అప్పటి నుంచే తనీ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు.
‘ఆ బాలికలకు ఓ సందేశం ఇవ్వదలచుకున్నా.. మీరు చలితో వణికిపోతున్నట్టు అనిపిస్తే.. రాహుల్ గాంధీ కూడా అలాగే ఫీలవుతారు’ అని వారికి చెప్పదలిచానన్నారు. తన దుస్తులను మీడియా హైలైట్ చేస్తోందని, కానీ తన యాత్రలో తన వెంట చిరిగిన దుస్తులతో నడుస్తున్న పేద రైతులు, కూలీల గురించి పట్టించుకోవడం లేదని రాహుల్ విచారం వ్యక్తం చేశారు.
‘నేను టీ షర్ట్ ధరించానా కాదా అన్నది ముఖ్యం కాదు.. ఈ దేశంలోని పేద రైతులు, కూలీలు, వారి పిల్లలు చిరిగిన దుస్తులు ఎందుకు ధరించవలసి వస్తున్నదన్నదే ముఖ్యం’ అన్నారాయన. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లలో యాపిల్ పండ్ల వ్యాపారమంతా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉందని, వారి పెత్తనమే సాగుతోందని చెప్పిన ఆయన.. ఈ పండ్ల రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదన్నారు.
..