సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ పై నుంచి పక్కనే ఉన్న గుడిసెలోకి లారీ దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా ఈ వాహనం అక్కడే చెట్లకు నీళ్లు పోస్తున్న ముగ్గురు కార్మికులను ఢీకొట్టి బోల్తాపడింది.
దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. పటాన్‌చెరు నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బాబు రాథోడ్ (48), కమలీబాయ్ (43), బసప్ప రాథోడ్ (23) గా గుర్తించారు.
లారీ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. లారీ డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది. సీసీటీవీ పుటేజీ ద్వారా లారీ డ్రైవర్ ను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.