ఇటు షర్మిల ! అటు కవిత !!
కుటుంబ వనితలే వర్కింగ్ ప్రెసిడెంట్లు !రెండు తెలుగు రాష్ట్రాల అధికార పక్షాల్లో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాలకు సవాల్ చేస్తున్నట్టుగా మహిళలకు ప్రయారిటీ కల్పిస్తూ వ్యూహాత్మకమైన నిర్ణయం జరగబోతోంది. ఇద్దరు సీఎంలకు కుటుంబాల్లో ఆడపడుచు కట్నం సిద్ధం అవుతోంది. వైసీపీలో షర్మిలకు, టీఆర్ఎస్‌లో కవితలకు కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
ఏపీ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టే సమయం చిక్కడం లేదు. అందుకే సోదరి షర్మిలను వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అనుభవం ఉంది. ఎన్నికల్లో పవర్ ఫుల్ డైలాగులతో సుడిగాలి పర్యటన చేసింది. పార్టీ కేడర్, లీడర్లకు షర్మిల సుపరిచితురాలు. అందుకే షర్మిలను వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తే పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూసే అవకాశం ఉంది. మహిళ అయినందున మహిళాలోకంలో ఇమేజ్ పెంచుకునేందుకు ఇది సరైన ప్లాన్ అని భావిస్తున్నారు. మహిళా నేత కనుక ప్రతిపక్షంపై విమర్శలు ఇరుకున పెట్టే విధంగా ఉంటాయి. ప్రతివిమర్శలు అడ్డగోలుగా చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తె కవిత ఎంపీగా, పార్టీ ముఖ్య నేతగా ప్రతిభావంతంగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయంగా తెలంగాణాలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వాటిని సమర్ధంగా తిప్పికొట్టడానికే టీఆర్‌ఎస్‌కు కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంటుగా కేటీఆర్ వున్నారు. మామూలుగా అయితే కేటీఆర్ ఈపాటికే ముఖ్యమంత్రిగా వుండాల్సింది. కాలం కలిసిరాక.. పరిస్థితులు, పరిణామాలు వ్యతిరేకంగా వుండటంతో కేసీఆర్ ఇప్పట్లో అంత రిస్కు తీసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి కేటీఆర్‌ని మంత్రి స్థానంలో కూర్చోబెట్టి మేనల్లుడికి కూడా ఒక పదవి ఇచ్చి కట్టిపారేశానని అనుకుంటున్న కేసీఆర్… కుమార్తె విషయంలో ఏం చేయాలనే విషయంలో తీవ్రంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా వినికిడి. నిజానికి ఇంతకుముందే ఒకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి హరీశ్‌కు ఇవ్వాలన్నప్రతిపాదన ముందుకొచ్చింది. కేటీఆర్ సీయం అయితే, హరీశ్ చేతిలో పార్టీ పగ్గాలు వుంచడం అంత శ్రేయస్కరం కాదని పలువురు కేసీఆర్‌కు సూచించారట. దాంతో ఈ ఆలోచన విరమించుకున్నట్టుగా చెబుతున్నారు. అక్కడ ఢిల్లీలో కూడా ప్రియాంకగాంధీకి కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన జరుగుతున్న దృష్ట్యా అంతకంటే ముందే కవితమ్మకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బావుంటుందని టీఆర్ఎస్ కేడర్‌లో కేసీఆర్‌కు అనుకూలురైన గ్రూపు అభిప్రాయపడుతోంది.
కవిత తెలంగాణా రాజకీయంలో అందరికీ సుపరిచితురాలు. పార్టీలో, ప్రజల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బతుకమ్మ పండుగను ఒక ఉద్యమంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఉంది. అందుకే ఆమెను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి రాజకీయ ఎత్తులకు పైఎత్తులు ఆమె ద్వారా వేయించాలని కేసీఆర్ ప్లాన్.