అంతర్జాతీయ సవాళ్లను తట్టుకుని నిలబడి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ క్రమంలో 2022-23 సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను పెంచుతున్నట్టు ప్రపంచ బ్యాంక్ మంగళ వారం పేర్కొంది.
భారత వృద్ధి రేటు అంచనాను అక్టోబర్ నెలకు గాను 7.5 నుంచి 6.5 శాతానికి ప్రపంచ బ్యాంకు తగ్గించింది. తాజాగా 2022-23 సవంత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాను 6.9 శాతానికి పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది.
2022-23 జులై- సెప్టెంబర్లో భారత జీడీపీ 6.3 శాతం మేర పెరిగింది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఐరోపా, చైనాలోని ఏర్పడిన వేర్వేరు పరిణామాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడలేదని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.
2022-23లో జీడీపీలో 6.4శాతానికి ద్రవ్య లోటును పరిమితం చేయాలన్న టార్గెట్‌ను భారత ప్రభుత్వం చేరుకోగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.