ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉందని, వర్ధమాన దేశాల నేతలు చొరవ తీసుకుని ఈ సంక్షోభ నివారణకు కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మీ వాణి భారత దేశ వాణి కావాలని, మీ ప్రాధాన్యతలు ఇండియాకు కూడా ప్రాధాన్యతలేనని అన్నారు. అంటే ఈ సంక్షోభ సమయంలో ఒకరినొకరు సహకరించుకుని.. దీని పరిష్కారానికి యత్నిద్దామని ఆయన చెప్పారు. ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ స్పెషల్ వర్చ్యువల్ సమ్మిట్’ లో ప్రారంభోపన్యాసమిస్తూ ఆయన.. భవిష్యత్తులో మన దక్షిణాది దేశాల బాధ్యత ఎంతో ఉందని, మనకెదురవుతున్న ప్రపంచ వ్యాప్త సవాళ్ళలో చాలావరకు గ్లోబల్ సౌత్ సృష్టించినవి కావని, కానీ అవి మనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు.
‘గ్లోబల్ సౌత్ లో తన సోదరులుగా భావిస్తున్న దేశాలతో ఇండియా సదా తన అనుభవాలను పంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేబట్టిన సందర్భంగా ఇండియా సహజంగానే తన గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరిస్తుంది’ అని మోడీ చెప్పారు. ఈ సమ్మిట్ రేపు కూడా జరగనుంది. యుద్ధం, తీవ్రవాదం, సంఘర్షణ, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు కలగలసిన మరో కొత్త ఏడాది పేజీలోకి అడుగు పెట్టామని చెప్పిన మోడీ .. ఈ తరుణంలో ‘రెస్పాండ్’, ‘రెకగ్నైజ్’, ‘రెస్పెక్ట్’, ‘రిఫామ్’ అన్న నాలుగు సూత్రాల గ్లోబల్ అజెండాతో ముందుకు పోవలసి ఉందన్నారు. సమస్యల పట్ల స్పందన, గుర్తింపు, గౌరవం, సంస్కరణ అన్నవే ఇవి అని వివరించారు.
అంతర్జాతీయ చట్టాలను, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించుకుందామని, ఐరాసతో సహా అంతర్జాతీయ సంస్ధలను సంస్కరించుకుందామని ఆయన అన్నారు. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలకు ఆయా దేశాలు స్పందించాల్సి ఉందని, ఉమ్మడిగా కలిసి ఉన్న అంశాలను గుర్తించవలసిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. ఆహారం, ఇంధనం, ఎరువులు వంటివాటి కొరతను గురించి ఆయన ప్రస్థావిస్తూ .. యుద్ధం, సంఘర్షణ, వంటివాటి ఫలితమే ఇవన్నారు. కోవిడ్ పాండమిక్ కూడా తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
‘యూనిటీ ఆఫ్ వాయిస్, యూనిటీ ఆఫ్ పర్పస్’ అనే థీమ్ తో ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్’ ను నిర్వహిస్తున్నారు. ఓ ఉమ్మడివేదికపై గ్లోబల్ సౌత్ దేశాలు ఒక్కటిగా తమ ప్రాధాన్యతలను, దృక్పథాలను షేర్ చేసుకోవడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని 125 కి పైగా దేశాలను ఆహ్వానించారు.