ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రెస్ అథనమ్ గెబ్రియాసిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కన్నా చాలా ప్రమాదకరమైన మరో మహమ్మారి రాబోతోందని ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాలు మరో పాండెమిక్ ను ఎదుర్కొనేందుకు రెడీగా వుండాలని ఆయన సూచించారు.
ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుని కొంత కుదుట పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఆయన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలు ఒక్క సారి ఉలిక్కి పడ్డాయి. ఆ మహమ్మారి ఏంటనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వకపోవడం ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది.
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కొవిడ్-19 ముగిసిందని ప్రకటించినంత మాత్రాన మహమ్మారి ముప్పు తొలిగి పోయినట్టు కాదని తెలిపారు. మరో వేరియంట్ ముప్పు పెరుగుతోందని చెప్పారు. అది మరో కొత్త వ్యాధికి, మరణాలకు కూడా దారి తీసే అవకాశం ఉందని అన్నారు. ప్రాణాంతకమైన మరొక వ్యాధికారక ముప్పు ఇంకా మిగిలే వుందన్నారు.
మరో మహమ్మారి మన ముందుకు వచ్చినప్పుడు ప్రపంచమంతా సమిష్టిగా, నిర్ణయాత్మకంగా దానికి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు మార్గాలను కనిపెట్టేందుకు ఈ తరం అంకిత భావం చూపాల్సిన అవసరం ఉందన్నారు.