ప్రపంచ కుబేరుల్లో భారతీయుల లెక్క తప్పుతోంది. ఇప్పటివరకు ఉన్న స్థానం నుంచి కిందికి దిగుతున్నారు. తాజాగా సంపదలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి తగ్గారని బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ ప్రకటించింది. టాప్ లో యధాప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉండగా రెండో స్థానంలో ఎలాన్ మస్క్, మూడో స్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారని వెల్లడించింది.
ఇక రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ అయితే 12 వ స్థానంలో ఉన్నారు. గత 24 గంటల్లో గౌతమ్ అదానీ నికర సంపద 872 మిలియన్ డాలర్ల మేర తగ్గిందట. గత ఏడాది జనవరి 24 నుంచి ఆయన 683 మిలియన్ డాలర్లను నష్టపోయినట్టు బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. అలాగే అంబానీ 457 మిలియన్ డాలర్లు, ఆ తరువాత 2.38 మిలియన్ డాలర్లు నష్టపోయారు. అయితే వీరిద్దరూ ఆసియాలో అత్యంత ధనికులేనని మాత్రం స్పష్టమయింది.
బెర్నార్డ్ అర్నాల్ట్ 188 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో ఉండగా.. ఎలాన్ మస్క్ 145 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలోనూ, జెఫ్ బెజోస్ 121 బిలియన్ డాలర్లతోను వరుసగా 1,2, 3 స్థానాల్లో ఉన్నారు. 120 బిలియన్ డాలర్లతో అదానీ నాలుగో స్థానానికి చేరుకున్నారు. 84.7 బిలియన్ డాలర్లతో ముకేశ్ అంబానీ 12 వ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ లో కూడా అదానీ నాలుగో స్థానంలో ఉన్నట్టు గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన జాబితాలో ప్రకటించారు. ఇండియాలోనూ, విదేశాల్లోనూ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురి కావడంవల్లే ఆయన సంపద తరుగుతోందని ఓ అంచనా.