పువ్వులు, పండ్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు. పూలు మనసు నింపితే, పండ్లు కడుపు నింపుతాయి. పూలనుంచి పుట్టుకొచ్చే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డాక్టర్లు కూడా పండ్లు తినమని సలహాఇస్తారు.అయితే కొన్ని పండ్లు చాలా చవగ్గా దొరుకుతాయి. మరి కొన్నిపండ్ల రేట్లు చెట్టెక్కి కూర్చుంటాయి.
ఇంకొన్నిటి రేట్లు మాత్రం చెట్టెక్కి కాదు, ఏకంగా ఆకాశంలో ఉంటాయి. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్ల గురించి తెలుసుకుందామని మీకు ఎప్పుడైనా అనిపించిందా..!
ఆలస్యం ఎందుకు తెలుసుకుందాం. ఆ పండుకి సంబంధించిన ఒక్కో ఖరీదు 10 లక్షల రూపాయలు. నమ్మకం కలగటం లేదా నిజమండి..! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా పరిగణించబడుతుంది. వివరాల్లోకి వెళదాం.
జపాన్ కు చెందిన రూబీ రోమన్ ద్రాక్ష ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. దాని ఎరుపు రంగు కారణంగా, దీనిని రూబీ రోమన్ గ్రేప్స్ అని పిలుస్తారు. రూబీ రోమన్ ద్రాక్ష విలువ కారణంగా ప్రపంచ రికార్డు బుక్‌లో చోటు సంపాదించింది.
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు అనే గుర్తింపును పొందింది. 2020లో జపాన్‌లో రూబీ రోమన్ ద్రాక్ష గుత్తి $12,000 (సుమారు రూ. 9.76 లక్షలు)కి వేలం వేయబడింది. నివేదికల ప్రకారం రూబీ రోమన్ ద్రాక్ష గెల విలువ రూ.10 లక్షలు. ఈ రూబీ రోమన్ ద్రాక్షను హ్యోగో ప్రిఫెక్చర్‌లోని అమగాసాకిలోని సూపర్ మార్కెట్‌లో విక్రయించారు.
ఈ పండు ఎప్పుడూ ఖరీదైన పండ్ల జాబితాలోనే ఉంటుంది. రూబీ రోమన్ ద్రాక్ష అధిక ధర కారణంగా, ఇది సూపర్ మార్కెట్లలో మాత్రమే లభిస్తుంది. జపాన్‌లో ఈ ఖరీదైన పండ్లను వారివారి దగ్గరివారికి, ప్రియమైన వారికి ఇచ్చుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో, వివాహాది శుభకార్యాల్లో సమర్పించుకోవటం ఇక్కడ
ఒక సంప్రదాయం. జపాన్‌లోని పండ్లు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన తనిఖీ ప్రక్రియ ద్వారా విక్రయించబడతాయి. అక్కడ ద్రాక్షను మూడు వర్గాలుగా విభజించారు. మొదటిది సుపీరియర్, స్పెషల్ సుపీరియర్, మూడవది ప్రీమియం. ప్రీమియం గ్రేడ్ పొందడానికి ద్రాక్ష ఖచ్చితంగా ఉండాలి.
రూబీ రోమన్ ద్రాక్ష రెండు బ్యాచ్‌లను 2021 సంవత్సరంలో ప్రీమియం గ్రేడ్‌లో ఉంచినట్లు ఒక నివేదిక పేర్కొంది. 2019 – 2020 సంవత్సరాల్లో ఏ పండు కూడా అర్హత పొందలేదు.