ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టాయిలెట్ దొరికింది. అది కూడా ఫ్లష్ టాయిలెట్. అదేంటి.. ఫ్లష్ టాయిలెట్స్ ఈ మధ్యకాలంలో వచ్చాయి కదా! అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? కానీ ఈ టాయిలెట్ దాదాపు 2400 ఏళ్ల నాటిదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఈ పురాతన ఫ్లష్ టాయిలెట్ చైనాలోని జియాన్ నగరంలోని రెండు బిల్డింగులను తవ్వుతుంటే బయటపడింది. పురాతన శాస్త్రవేత్తలు దీన్ని ‘లగ్జరీ టాయిలెట్’ గా పిలుస్తున్నారు.
చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఈ తవ్వకాలను చేపట్టారు. తవ్వకాల్లో దొరికిన ఫ్లష్ టాయిలెట్ 2,200 నుంచి 2,400 ఏళ్ళ కిందటి వారింగ్ స్టేట్స్ పీరియడ్ లోనిది అని, హాన్ డైనస్టీ మొదట్లో దీన్ని వాడి ఉంటారని చెబుతున్నారు. అయితే దీన్ని తయారు చేసింది.. కనిపెట్టింది మాత్రం విక్టోరియన్ ఇంగ్లాండ్ వాళ్ళు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
అంత పాత టాయిలెట్ అయినా దానిలో నీరు వెళ్ళే విధానం నేటి యుగానికి సంబంధించిన దానిలాగే ఉందని ఎన్షియంట్ టూల్స్ డిజైన్ చేసే ఫాన్ మింగ్యాంగ్ చెబుతున్నారు. వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధునాతనంగా ఉందని అంటున్నారు. టాయిలెట్ బౌల్, పైప్, మరికొన్ని విరిగిన పార్ట్స్ తవ్వకాల్లో దొరికాయి. ఈ టాయిలెట్ ను చైనాలోని ధనవంతులు ఉండే షాంక్సీ ఫ్రావిన్స్ లో వాడి ఉంటారని అంచనా వేస్తున్నారు.
టాయిలెట్ బౌల్ ని వాడిన ప్రతీసారి సర్వెంట్స్ అందులో నీళ్ళు వేసి ఉంటారని చెబుతున్నారు. చైనాలో ఇప్పటివరకు కొనుగొనబడిన మొట్టమొదటి ఏకైక ఫ్లష్ టాయిలెట్ ఇదే అని, ఇలాంటిది కనుగొనడం తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు ఆర్కియాలజిస్టులు.
ఇలా భూమిలోపల దొరికిన టాయిలెట్ కూడా ఇదే మొదటిదని వివరించారు. దీని మీద పరిశోధనలు చేస్తే అప్పటి ఆహారపు అలవాట్లు కూడా తెలుస్తాయని చెబుతున్నారు. అలాగే దీన్ని తయారు చేయడానికి వారు ఎలాంటి పదార్థాలను ఉపయోగించారో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.