తెలంగాణలో గురుకులాల పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు పెట్టే అన్నంలో పురుగులు,వానపాములు వస్తున్నాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక గురుకులాల్లో పని చేస్తున్న సిబ్బంది పై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి.
తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థులు వారి సమస్యలు పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట బస్టాండ్ లో ఉదయం 5 గంటలకు ధర్నా, రాస్తా రోకోకు దిగారు. వీరితో పాటు ధర్నాలో ఏబీవీపీ కూడా పాల్గొంది. ఇక ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ఆహారంలో పురుగులు, వానపాములు రావడంతో.. తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని మండిపడ్డారు.
అలాగే ప్రిన్సిపాల్ విద్యార్థులను వేధిస్తుందని, అవినీతికి పాల్పడుతుందన్నారు. వాచ్ మెన్ రామస్వామి తాగిన మత్తులో విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా.. ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక వర్డెన్ రమ్య విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో పూర్తి విచారణ చేసి ప్రిన్సిపాల్, వార్డెన్ రమ్య, వాచ్ మెన్ రామస్వామితో పాటు కిచెన్ మాస్టర్ భద్రమ్మలను సస్పెండ్ చేయాలని విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో పాటు ఏబీవీపీ డిమాండ్ చేసింది.
ఇక గురుకులలో జరుగుతున్న అవినీతి పై పూర్తి విచారణ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నేతలు కోరారు. అదే విధంగా సిరిసిల్ల ఏకలవ్య ఆదర్శ పాఠశాలలోని సమస్యలను తీర్చకపోతే.. త్వరలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. అయితే ఆర్సీఓ వెంకన్న అందరిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.