బ్రిటన్‌లో పాక్ గ్యాంగ్ ఆగడాలు

బ్రిటన్‌లోని టెల్‌ఫోర్డ్ టౌన్‌లో పాకిస్తాన్ గ్యాంగ్‌లు సాగించిన దారుణాలు దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయి. వేలాదిమంది అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు చేసి అమ్మివేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఒక్కోసారి వాళ్లని ఈ గ్యాంగ్ లు హతమార్చుతున్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్థానీ ముస్లింలు ఈ దారుణాలకు తెగబడుతున్నట్లు యూకేలోని ‘మిర్రర్’ అనే డైలీ తెలిపింది.

యుక్తవయసులోవున్న వాళ్లనేకాకుండా 11 ఏళ్ల మైనర్ బాలికలను కూడా ఈ ముఠాలు తమ టార్గెట్‌గా ఎంచుకుని దాదాపు 40 ఏళ్లుగా నరకం చూపుతున్నట్లు ప్రస్తావించింది. తప్పుడు వాగ్దానాలు, హామీలతో దేశీయ మహిళలను లోబరుచుకుని వాళ్ల ద్వారా ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు రాసుకొచ్చింది. బాలికల లైంగిక వేధింపుల నివారణకు పాటుపడుతున్న డినో నుసివెల్లి ఈ విషయాలను తెలిపారు. వీళ్లని సెక్స్ బానిసలుగా పరిగణిస్తూ కేవలం టెల్‌ఫోర్డ్ టౌన్‌లో కాకుండా రోచడేల్, రోథరామ్ వంటి చిన్న టౌన్లలో కూడా ఆగడాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. పోలీసులతో ఈ ముఠాలకున్న సంబంధాల కారణంగా వాళ్లు కూడా ఈ వ్యవహారంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న వైనం తెలిసిందన్నారు.

తన 16వ బర్త్ డే జరుపుకున్న మరుసటిరోజే తనకు మత్తుమందు ఇచ్చిన ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఓ బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే సజీవ దహనం చేస్తామని ముఠా నేతలు హెచ్చరించినట్టు ఆమె వాపోయింది. కేవలం తెల్లజాతి మహిళలనేకాక, బ్రిటన్‌లోని హిందూ, సిక్కు యువతులను కూడా వీళ్లు టార్గెట్ చేశారు. ఈ ముఠా వెనుక ఓ బ్రిటీష్ ఎంపీ కూడా వున్నట్లు తేలింది. ఇప్పటికీ టెల్‌ఫోర్డ్‌లో ఈ భయంకర నరకాన్ని చూస్తున్న బాధితులు ఎంతోమంది వున్నట్లు భావిస్తున్నారు. ఐతే, భయంతో తమకు జరిగిన దారుణ అనుభవాల గురించి చెప్పేందుకు వీళ్లు ముందుకు రావడంలేదు.