ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ.. దేశ ప్రజల్లో ఎక్కువ మందికి పరిచయం ఉన్న ముఖం. అంతర్జాతీయంగా ‘రెజ్లర్’ ఆటలో ఎన్నో మెడల్స్ సంపాదించిన మల్ల యుద్ధ వీరుడు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నడ్డా.
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశానికి సరైన ప్రధాని మోడీ అనేది తన అభిప్రాయమన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన పాలనలో నేనూ ఎందుకు భాగం కాకూడదన్న ఆలోచనతో పార్టీలో చేరానని అన్నారు. బీజేపీ జాతీయ విధానం నచ్చి బీజేపీలో చేరుతున్నట్టు ఖలి తెలిపారు.
బీజేపీ జాతీయ విధానం తనను ఆకర్షించినట్లు ఖలి చెప్పాడు. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికే చెందిన ఖలి బీజేపీలో చేరడం పార్టీకి ఎంతో కొంత లాభం చేకూరనుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. 2020లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన రైతు సంఘాలకు ఖలీ మద్దతు ఇచ్చారు. రైతులకు అండగా ప్రజలు నిలువాలని కూడా ఆయన కోరారు.
49 ఏళ్ల గ్రేట్ ఖలి.. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్ షిప్ ద్వారా ఇతడు సుపరిచితుడు. అయితే.. అతను రెండు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. 7 అడుగుల ఒక అంగుళం ఎత్తుతో, తన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించేవాడు ఖలి.