రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ కి ఉద్వాసన తప్పేట్టు లేని సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తమను లైంగికంగా వేధిస్తున్నాడని, అవమానపరుస్తున్నాడని ఆరోపిస్తున్న రెజ్లర్లు వినేష్ ఫొగట్, సాక్షి మాలిక్ ప్రభృతులతో కేంద్రా క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిన్న సుమారు 4 గంటలకు పైగా తన నివాసంలో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది. అయితే శుక్రవారం కూడా ఇవి కొనసాగే అవకాశాలున్నాయి.
బ్రిజ్ భూషణ్ ని, కొంతమంది కోచ్ లను వారి పదవుల నుంచి తొలగించాలని తాము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టు రెండు రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు ..అనురాగ్ ఠాకూర్ కి స్పష్టం చేశారు. అధికారిక పర్యటనపై హిమాచల్ ప్రదేశ్ కి వెళ్లిన ఠాకూర్.. నిన్న సాయంత్రం తిరిగి ఢిల్లీకి వచ్చి.. వీరితో చర్చలు జరిపారు. వీరి డిమాండ్లను ఆయన సావధానంగా విన్నారని, చర్చలు కొనసాగిద్దామని పేర్కొన్నారని తెలుస్తోంది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ని రద్దు చేయాలని కూడా వినేష్ ఫోగట్ తదితరులు కోరినట్టు వెల్లడైంది. లక్నోలో నిర్వహించిన నేషనల్ క్యాంపులో బ్రిజ్ భూషణ్, కొంతమంది కోచ్ లు తమను వేధించారన్న తమ ఆరోపణలకు ఆధారాలున్నాయని వీరు మంత్రి వద్ద స్పష్టం చేశారు. అలాగే భూషణ్ సంస్థ నిధులను దుర్వినియోగపరిచారని కూడా వారు ఆరోపించారు.
సమస్య వేడెక్కడంతో బ్రిజ్ భూషణ్.. ఈ నెల 22 న రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పిన ఆయనను కేంద్రం తొలగించవచ్చునని సమాచారం. ఇప్పటికే రెజ్లర్ల ఆరోపణలపై 72 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆయనను ఆదేశించింది.