రెజ్లర్ల నిరసనలు ఎట్టకేలకు ముగిశాయి. రెజ్లర్లు తమ మీ టూ ఉద్యమాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆందోళనలు విరమించారు. రెజ్లర్ల సమస్యలను పరిష్కారిస్తామంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ గత మూడు రోజులుగా రెజ్లర్లు నిరసనలు తెలుపుతున్నారు. మొదటి దఫా చర్చలు విఫలం కావడంతో వారు ఆందోళనలు కొనసాగించారు. ఈ క్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్ల సమస్యలపై వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియాతో పాటు మరికొంతమంది రెజ్లర్లతో రెండో దఫా చర్చలు జరిపారు.
బ్రిజ్‌భూషణ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు గాను ఐఓఏ కమిటీని నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో రెజ్లర్లు శాంతించారు.
బ్రిజ్ భూషణ్ పై విచారణ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. కమిటీ సభ్యుల పేర్లను రేపు ప్రకటిస్తామన్నారు. కమిటీ విచారణను పూర్తి చేసే వరకు బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాడన్నారు.
24 గంటల్లోగా తన పదవికి రాజీనామా చేయాలంటూ బ్రిజ్ భూషణ్ కు నోటీసులు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. ఆయన్ని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలంటూ రెజ్లర్లు మూడు రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. కానీ తాను మాత్రం ఆ పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించారు. ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధమని ప్రకటించారు.