భారత రెజ్లింగ్ సమాఖ్య అత్యవసర కౌన్సిల్ సమావేశం రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు అయోధ్యలో కౌన్సిల్ సమావేశం జరగాల్సి వుంది. అయితే ఫెడరేషన్, దాని ప్రెసిడెంట్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫెడరేషన్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపి వేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
క్రీడా శాఖ ఆదేశాల నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేశారు. యూపీలోని గోండాలో జరిగే ర్యాంకింగ్ టోర్నమెంట్ తో పాటు ఫెడరేషన్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపి వేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్యకు నిన్న క్రీడా శాఖ నిన్న సూచించింది.
మరోవైపు రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ ను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. అతను నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారంటూ క్రీడా శాఖ తెలిపింది. రెజ్లింగ్ సమాఖ్య కార్యకలాపాలు సజావుగా సాగేందుకు గాను ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని క్రీడా శాఖ ప్రకటించింది. మరోవైపు రెజర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. విచారణ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారని పేర్కొంది.