దర్శక ధీర ఎస్.ఎస్. రాజమౌళి మూవీ అంటే సినీ లోకమంతా ఎంతో క్రేజ్. ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కథానాయకులుగా తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్ భారతీయ చిత్రసీమలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ఆర్.ఆర్.ఆర్ బిగ్ స్క్రీన్ పైకి రాక ముందే రాజమౌళి తన మనో ఫలకంపై ఎప్పుడో వీక్షించాడట. ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రాకు రాజమౌళి ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన మైండ్ స్క్రీన్ పై ఆర్.ఆర్.ఆర్ దృశ్య కావ్యం అద్బుతంగా కనిపించిందట. ఒక మూవీ కథను ఇలా వైవిధ్యంగా చెప్పవవచ్చన్న అంశం తనకు అప్పుడే అర్ధమయిందని మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా చెబుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాలే ఆర్.ఆర్.ఆర్ కథాంశం. ఇద్దరు విప్లవ వీరుల జీవిత స్ఫూర్తితో ఓ ఫిక్షనల్ స్టోరీని రాజమౌళి ఆసక్తి కరంగా ఉహించారు. తన ఉహకు ప్రతిరూపమైన ఆర్.ఆర్.ఆర్ స్క్రీన్ మేజిక్ ను తన మనస్సులో అందంగా చిత్రీకరించుకుని మాటల రచయితకు స్టోరీ వివరించారు. పదునైన సంభాషణలు పడాలంటే కథాంశం రచయిత మదిలో చెరగని అద్బుత ముద్ర వేయాలి. ఆర్.ఆర్.ఆర్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలున్నాయి. అద్బుత కాల్పనిక కథ స్క్రిప్ట్ విషయంలో రాజమౌళి క్లారిటీ మహాద్భుతంగా ఉందని మాటల రచయిత సాయిమాధవ్ అంటున్నారు. బాహుబలి చిత్రానికే జక్కన్నతో పనిచేయాల్సి ఉండగా అప్పుడు కుదరలేదని, ఇప్పుడు ఇంతటి గొప్ప చిత్రంతో తమ కాంబినేషన్ కుదిరిందని సంతోషం వ్యక్తం చేశాడు.
అయితే.. అంత అద్బుత చిత్రం టైటిల్ ఆర్.ఆర్.ఆర్ అంటే ఏమిటి? ‘రుధిర రణ రంగం’ పేరు ఖాయం అవుతుందా? ‘రణ రంగంలో రక్తతర్పణం’ ఖాయమవుతుందా? మరో ఆసక్తికర పేరు ముందుకు వస్తుందా? అనేది ఉత్కంత రేపుతోంది.