చైనాలోని వుహాన్ లో వందలాది మందిని బలి తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఏకంగా వుహాన్ హాస్పిటల్ డైరెక్టర్ నే బలి తీసుకుంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కు కేంద్ర బింధువైన వుహాన్ లోని వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ లీ జిమింగ్ మంగళవారం మరణించారు. ఆయన్ని బతికించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని చైనా అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది. ఆరుగురు మెడికల్ వర్కర్స్ వైరస్ తో మరణించారని…1716 మంది సిబ్బందికి వైరస్ సోకినట్టు చైనా గత వారం ప్రకటించింది.
లీ చనిపోయినట్టు మంగళవారం అర్ధరాత్రి చైనా మీడియా ప్రకటించగానే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఆ వెంటనే ఆ పోస్టుల స్థానంలో లీని రక్షించడానికి ఇంకా డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారని పెట్టారు. లీ మరణంతో వుహాన్ లో ప్రజలు విషాధంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు.