హిజాబ్ వివాదం నేపథ్యంలో హైకోర్టు జడ్జీలకు బెదిరింపులు రావడంతో బీజేపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అందరికీ వై కేటగిరి భద్రతను కల్పించింది. ఈమేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటన చేశారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని మండిపడ్డారు బొమ్మై. హైకోర్టు జడ్జీలను బెదిరిస్తే ఎవరూ ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదని.. అసలైన మతతత్వం అని చురకలంటించారు.
హిజాబ్ అంశంలో ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ముస్లిం అనుబంధ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిజాబ్ వివాదంపై తీర్పు చెప్పిన బెంచ్ కు నేతృత్వం వహించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థీని తౌహీద్ జమాత్ అనే సంస్థ బెదిరించింది. ఆయనతో పాటు తీర్పులో భాగమైన న్యాయమూర్తులనూ చంపేస్తామంటూ ఓ వీడియో ద్వారా వఆర్నింగ్ ఇచ్చింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు న్యాయవాది ఉమాపతి ఫిర్యాదు చేశారు.
వాట్సాప్ లో తనకు ఓ వీడియో వచ్చిందని.. అందులో జార్ఖండ్ న్యాయమూర్తి మార్నింగ్ వాక్ చేస్తుండగా హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ అవస్థీని బహిరంగంగా బెదిరించడం కనిపించిందని వివరించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తౌహీద్ జమాత్ సంస్థకు చెందిన ముగ్గురు సభ్యులను గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.
తిరునల్వేలికి చెందిన తమిళనాడు తాహీద్ జమాత్ ఆడిటింగ్ కమిటీ మెంబర్ రహ్మతుల్లా, తంజావూరులోని మత బోధకుడు ఎస్.జమాల్ మహ్మద్ ఉస్మానీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరే కాదు.. తౌహీద్ జమాత్ కు చెందిన పలువురిపై బెదిరింపు కేసులు నమోదయ్యాయి. ఈ బెదిరింపుల దర్యాప్తులో స్వయంగా పాల్గొనాలని డీజీపీని ఆదేశించారు సీఎం. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు.