యాదాద్రి : యాదాద్రి ఆలయంలో స్వామి భక్తి ప్రదర్శించే కుడ్యచిత్రాలే కాదు, రక్తి కలిగించే బూతు బొమ్మలు కూడా వున్నాయా? యాదాద్రి బాగోతంపై వరుస సంచలన కథనాలు అందిస్తున్న ‘తొలివెలుగు’కు భక్తుడొకరు పంపించిన బూతు బొమ్మ ఈ సరికొత్త సందేహాన్ని రేపుతోంది. ‘అమ్మో..! బూతు బొమ్మ..’ అని అనుకోకండి. అక్షరాలా ఇది బూతుబొమ్మే ! ఐతే, ఇది నిజంగా యాదాద్రి ఆలయంలో నిర్మిస్తున్న రాతి స్థంభాలపై ఉందా.. లేదా అనేది ‘తొలివెలుగు’ తవ్వితీస్తోంది. ఈ దరిద్రం కూడా గుట్టపై వుందా అని ఆలయ నిర్మాణ ప్రత్యేకాధికారి కిషన్‌రావుని ‘తొలివెలుగు’ ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు ‘అబ్బే.. అలాంటిదేం లేదే’ అనేశారు. ఐతే, తొలివెలుగుకు భక్తుడు పంపించిన ఫోటోని ఆయనకు ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ విషయంపై తను కూడా ఎంక్వయిరీ చేసి చెబుతానని అనడం కొసమెరుపు.
ఇంతకీ ఈ బూతుబొమ్మలో ఏముంది? సభ్య సమాజం చూడలేని చీకటి బాగోతం వుంది. పూర్వం మన గుడులలో అక్కడక్కడ ఇలాంటి శిల్పాలు వుండేవన్న మాట వాస్తవమే. కాకపోతే, అవి అన్ని గుడులలో కాదు. అక్కడక్కడ కొన్ని ఆలయాల్లో ఆయా శిల్పరీతుల నైపుణ్యాన్ని చాటేందుకో, లేదా ఏదో పరమార్ధం చాటేందుకు వాటిని అమర్చేవారు. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో దీనికి సంబంధించిన సన్నివేశం కూడా వుంది. కామి గాని వాడు మోక్షగామి కాడనే నానుడి కూడా వుంది. తాపి ధర్మారావు ఆలయాల్లో ఈ బూతుబొమ్మలపై పరిశోధన చేసి రాశారు. పూర్వం లైంగిక విజ్ఞానం అంతగా లేని రోజుల్లో రాచరికపు కాలంలో పూర్వీకులు తీసుకొచ్చిన శిల్పకళారీతులలో ఇలా లైంగిక విజ్ఞానం కూడా అంతర్భాగంగా వుండేది. ఇప్పుడు రోజులు మారాయి. నెట్టింట్లో.. నట్టింట్లో ఎవరికి కావాల్సిన జ్ఞానం వారికి యధేచ్ఛగా దొరకుతోంది. అలాంటిది పవిత్రమైన దేవాలయాల్లో.. అది కూడా ఆధునిక శైలిలో ఈ కాలంలో నిర్మించే ఆలయాలలో ఈ దరిద్రాన్ని ఎందుకు తెస్తున్నారనేది ప్రశ్న.
పాలకులు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా..? లేక ప్రభుత్వ ప్రచారాన్ని, వ్యక్తి ఆరాధనని, దాంతో పాటు రక్తి మార్గాన్ని నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా జనానికి అందించాలనుకుంటున్నారా? వీళ్లు ఈ ఆలయంలో ఆధ్యాత్మికశోభను పెంచుతారా..? పతనం చేస్తారా? ఇది కేసీఆర్ సర్కార్‌కు ఒక సవాల్..? ఈ బూతు శిల్పాలే కనుక యాదాద్రిలో వున్నాయని తేలితే అది మరో సరికొత్త వివాదంగా మారడం ఖాయం.