పవన్ కల్యాణ్ తొలి ప్రేమ మూవీలో ‘బీచ్‌లో తాజ్‌మహల్’.. ఎప్పటికీ తెలుగు సినీ అభిమానులు మర్చిపోలేని సీన్. పవిత్రమైన యాదాద్రి, అక్కడి స్తంభాలపై వెలిసిన కేసీఆర్, కారు, సర్కారు – ఇది ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కోపంతో ఊగిపోయేలా చేస్తున్న సీన్.
అస్సలు పొంతన లేనట్టు అనిపించినా, ఈ రెండింటికి ఒక ముఖ్యమైన సంబంధం వుంది. అదే ఆనంద్‌సాయి.
సినిమాల్లో సెట్స్ వేస్తూ ఆర్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటున్న ఆనంద్‌సాయి యాదాద్రి రూపకర్తగా ఎలా మారారు? ఈరోజు దేవాలయంలో ఈ బొమ్మలు ప్రత్యక్షం కావడం వెనుక కారణాలు ఏంటి? తొలివెలుగు మీకోసం కొన్ని నిజాలు తవ్వే ప్రయత్నం చేసింది.
పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువ ఆనంద్‌సాయి పనిచేసేవాడు. సినిమాలు లేనప్పుడు పెద్దవాళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్ళకి సెట్లు వేసేవాడు. ఎన్టీఆర్, లోకేష్, ఇలా చాలామంది పెద్దింటి పెళ్లిళ్లు ఈయన వేసిన పందిళ్ళలో జరిగాయి. తిరుపతి దేవస్థానంలా పెళ్లి మండపాలని తీర్చిదిద్దడం అనే ట్రెండ్‌ని ఆనంద్‌సాయి మొదలుపెట్టాడు. బంగారు రంగు గోపురాలు పెట్టగానే తిరుపతిలా వుంది అని జనం మురిసిపోయేవారు.
పెద్దింటి పెళ్లిళ్లు అని ముందే అనుకున్నట్టు, తెలంగాణాలో ఒక మాహాదిగ్గజం ఇంట్లో పెళ్లిళ్లకు కూడా పందిళ్లు వేశాడు ఆనంద్‌సాయి. ఆ పెద్దాయనే “మై హోమ్” రామేశ్వరరావు. ఆనంద్‌సాయి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం, రామేశ్వరరావు, అతని తమ్ముడు జగపతిరావు, ఆనంద్‌సాయి పనితనానికి మెచ్చి, స్వామివారి ఆశీస్సులు తప్పక ఉండాలి అని తెలుగు రాష్ట్రాలలో నడిచే దైవం అయిన చిన్నజీయర్ దగ్గరకు తీసుకొని వెళ్లారు. స్వామివారికి తొలిప్రేమ తాజ్‌మహల్ నచ్చిందో.. లేక పెళ్లిళ్లలో పందిళ్లు నచ్చాయో తెలియదు కానీ, వందల ఏళ్ళ ప్రాశస్త్యం కల యాదగిరిగుట్టను తీర్చిదిద్దే బాధ్యతలు ఆనంద్‌సాయికే దక్కాలని తీర్మానించారు. తెలంగాణాలో జీయర్ స్వామి తలుచుకుంటే కాంట్రాక్టులకు ఏమి తక్కువ? వెనువెంటనే సీఎం కేసీఆర్ కూడా “మమ” అని అనడం జరిగిపోయింది.
సినిమాలో ఆర్ట్ డైరెక్టర్‌కి ఎంతో స్థల వైశిష్ఠ్యం ఉన్న నర్సింహస్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించకూడదని శాస్త్రాల్లో లేదు…కానీ కనీసం ఆగమ శాస్త్రం, స్థల పురాణం కూడా తెలియని వాళ్ళకి ఎలా ఇస్తారు అనేది ఇప్పటికయినా ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఏ అర్హత ఉందని ఆనంద్‌సాయికి ఈ బాధ్యత అప్పగించారు? ప్రాచీన సంప్రదాయాలను భ్రష్టు పట్టించడానికి ఇష్టమొచ్చిన బొమ్మలు చెక్కించారు?
తిరుమలలో మండపాన్ని పునర్నిర్మించాలంటే ఆగమ పండితులు వంద నియమాలు పెడతారు కదా… మరి మా యాదగిరి నర్సింహస్వామి అంటే ఎందుకంత చిన్నచూపు? ఐదు వేల చదరపు అడుగుల దేవాలయాన్ని మూడున్నర ఎకరాల్లో షాపింగ్ కాంప్లెక్సులను కూడా గుడి డిజైన్‌లో భాగంగా కడతామన్నప్పుడే మనం చెంప పగలగొట్టి ప్రశ్నించాల్సింది. ఇది పవిత్ర దేవాలయం, కాంట్రాక్టులు, కాంప్లెక్స్‌లు వేరే ఎక్కడన్నా చూసుకోండి అని! అప్పుడు మనం అడగలేదు, ఈరోజు గుండెలు బాదుకుంటున్నాం. తొలివెలుగు దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆనంద్‌సాయికి కొన్ని కోట్ల రూపాయలు డిజైన్ ఫీజులు చెల్లిస్తున్నారు. పైగా రామానుజచార్యుల 108 అడుగుల విగ్రహ డిజైన్ బాధ్యతలు కూడా ఈ ఆనంద్‌సాయికే ఎప్పుడో కట్టబెట్టేశారు. తన తెలివి, చాతుర్యం అంతా ఉపయోగించి ఆ విగ్రహాన్ని “చైనా” నుంచి ఆనంద్‌సాయి తెప్పిస్తున్నారు.
అయినా ఆనంద్‌సాయిని అనుకోవడానికి లేదు, రికమండేషన్ కాగితాలు పట్టుకొని ఉద్యోగం సంపాదించిన వ్యక్తి తన బాస్‌ని ఎలా కాకాపడతాడో అలానే ఈయన కూడా. రేపు ఈ అయిదు వేల స్తంభాలలో చిన్నజీయర్ ఉండొచ్చు, తనకి ప్రత్యక్షంగా ఈ ‘కాంట్రాక్టు’ సాధించి పెట్టిన మైహోమ్ రామేశ్వరరావు బొమ్మ ఉండచ్చు, జీయర్ ఆశ్రమానికి తీసుకొని వెళ్లిన జగపతిరావు కూడా ఉండచ్చు.
అలానే అధికారులు సమర్దిస్తున్నారని ఆశ్చర్య పోవద్దు. రేపు ఆనంద్‌సాయిని అడిగినా ఇది ఒక గొప్ప డిజైన్ అనే చెప్తాడు. తాను చెక్కిన శిల్పంలో మండూకం దాగి ఉందని చెయ్యి తెగ నరుక్కోవడానికి అమరశిల్పి జక్కన్న వారసుడు కాదుగా. రామేశ్వర రావు మనిషి, జీయర్ ఆశీసులున్న కారణజన్ముడు.
ఇక యాదాద్రి నరసింహస్వామి అంటారా…ఎప్పుడో ఉగ్ర రూపంలో వస్తాడు లెండి.
ఇక్కడో కొసమెరుపు. ఇదే ఆనంద్‌సాయిని అమరావతి నగర రూపకల్పన కోసం పిలిపించారు. కానీ, అక్కడ ప్రభుత్వ సలహాదారుగా వున్న పెద్దమనిషి.. ఈ సినిమావాళ్లతో ఇలాంటివి చేయిస్తే అవి సెట్టింగ్స్‌లా వుంటాయని, జనం తిట్టిపోస్తారని నచ్చచెప్పడంతో అక్కడి ప్రభుత్వం కళ్లు తెరిచి ఆనంద్‌సాయిని ఆమడదూరం పెట్టేసింది.
తన భార్య వాసుకితో ఆనంద్‌సాయి (యస్.. మీరనుకుంటున్న తొలిప్రేమ సిస్టర్ వాసుకి)