దివ్యక్షేత్రాన్ని దిగజార్చేస్తారా?
రాముడి మేనల్లుడి క్షేత్రమే యాదగిరి!
బూతుబొమ్మలతో ఏం చేద్దామనుకున్నారు?
చినజీయర్ స్వామీ సమాధానం చెప్పాలి..
యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇవాళ్టిది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అది కొత్తగా కేసీఆర్ అందిస్తున్న మహత్తరమైన కానుక అసలే కాదు. ఆ స్థలానికో పురాణం వుంది. ఆ దివ్య క్షేత్రానికి చరిత్ర వుంది.
అసలీ పుణ్యస్థలి ఎవరు పేరు మీద వెలసిందో అందరికీ తెలుసు. యాద మహర్షి ఇక్కడ తపస్సు చేస్తే స్వామివారు వెలిశారని తెలంగాణ ప్రజలందరూ చెబుతారు. మరి ఈ యాద మహర్షి ఎవరో తెలుసా? హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడికి స్వయంగా మేనల్లుడు. అంటే అక్క కుమారుడు. ఆశ్చర్యంగా వుందా.? ఐతే, నిత్యం ధర్మ పన్నాగాలు వల్లించే శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి వారిని అడిగితే వారే చెబుతారు. శాంత స్వయంగా శ్రీరాముడి సోదరి. ఆమెను రుష్యశృంగునికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ రుష్యశృంగుడు-శాంతల సంతానమే ఈ యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఆంజనేయస్వామి సలహాతో ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలోనే చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడట. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన తక్షణం తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షస సంహారం చేశాడని పురాణ కథనం. ఆ సుదర్శనమే యాద మహర్షికి అక్కడ తపస్సుని కొనసాగించమని సూచించడంతో శ్రీహరి నరసింహస్వామి అవతారం దాల్చేంత వరకు అక్కడే వుండి ఘోర తపస్సు చేశాడట. దాంతో లక్ష్మీ నరసింహస్వామి అక్కడ వెలిశాడని చెబుతారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడని మరో కథనం.
ఇప్పుడు ఇక్కడ విషయంలోకి వస్తే.. అంతటి పురాణ ప్రాశస్థ్యం వున్న పుణ్యస్థలంలో బూతు బొమ్మలను చెక్కాలనే సంకల్పం ఎవరిదో కాని.. వారి పాద పద్మాలను పూజించి తెలంగాణా పాలకులతో ఘన సత్కారం చేయించాలని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలే ఈ క్షేత్రానికి ఆంజనేయుడు క్షేత్ర పాలకుడిగా వున్నాడు. ఆంజనేయుడు ఘోటక బ్రహ్మచారి. అటువంటి బ్రహ్మచారికి అపచారం చేసే బూతుబొమ్మల ఐడియా ఇచ్చిన వారిని మరి ఆ లక్ష్మీనారసింహుడే కాపాడాలి..!!